Search This Blog

Showing posts with label naveen reddy akiti. Show all posts
Showing posts with label naveen reddy akiti. Show all posts

Tuesday, 1 September 2026

చందమామ

చందమామ నా చిన్నప్పుడు ప్రతి రోజూ చూసిన చందమామను... 
ఇప్పుడు కనీసం నెలకు ఒక్కసారి కూడా చూడలేకపోతున్నాను. 
అదే ఆకాశం... 
అదే చందమామ... 
అదే వెన్నెల... 
అదే నేను... మరి... ఏమి మారిందంటారు? 
చందమామ మారలేదు... ఆకాశం చిన్నబడలేదు... వెన్నెల తగ్గిపోలేదు... 
నక్షత్రాలు దూరం కాలేదు... మారింది నా జీవితమే. 

ఒకప్పుడు సాయంత్రం అవుతుందంటే ఆకాశం వైపు చూసేవాడిని... 
ఇప్పుడు సాయంత్రం అవుతుందంటే గడియారం వైపు చూస్తున్నాను. 
ఒకప్పుడు వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం... 
ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్లతో మాట్లాడటానికే సమయం సరిపోవడం లేదు. 
ఒకప్పుడు ఆకాశాన్ని చూస్తూ కలలు కనేవాడిని... 
ఇప్పుడు కలల్ని చేరుకోవాలనే పరుగులో ఆకాశాన్నే మర్చిపోయాను. 

చెట్లు ఇంకా అదే నీడను ఇస్తున్నాయి... 
గాలి ఇంకా అదే చల్లదనాన్ని మోస్తోంది... 
వాన ఇంకా అదే మట్టి వాసనను తెస్తోంది... 
చందమామ కూడా ప్రతి రాత్రీ అదే చోట నిలబడి నన్ను పిలుస్తూనే ఉంది... 
కానీ... 
ప్రకృతికి నన్ను పలకరించడానికి ప్రతి రోజూ సమయం ఉంది. 
నాకు మాత్రం ప్రకృతిని పలకరించడానికి నెలకో రాత్రి కూడా లేదు. 
బహుశా... జీవితం బిజీ అయిపోలేదు... 

జీవించడానికి కావాల్సిన చిన్న చిన్న క్షణాలనే మనమే బిజీ చేసుకున్నాం. 
అందుకే చందమామ ఇప్పటికీ అదేలా ఉంది... 
మారింది ఒక్కటే— 
చందమామను చూసే ఆ చిన్న పిల్లాడు మాయమయ్యాడు .. పెద్దవాడయ్యాడు.. బిజీ అయిపోయినడు...

రచన : నవీన్ రెడ్డి ఆకిటి